సోల్జర్ జనరల్ డ్యూటీ (విమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులకు అవివాహిత యువతుల నుంచి భారతీయ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీపడవచ్చు. ఫిజికల్, మెడికల్ టెస్టు, పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ప్రకటన పూర్తివివరాలు చూద్దాం.
దేశవ్యాప్తంగా 6 ప్రాంతాల్లో (అంబాలా, లఖ్‌నవూ, జబల్‌పూర్, బెల్గాం, షిల్లాంగ్, పుణే) రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాలవారీ ఎవరు ఏ ప్రాంతంలో ర్యాలీకి హాజరు కావాలో నిర్ణయిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి వీటిని బెల్గాంలో నిర్వహిస్తారు. ర్యాలీ కేంద్రాల్లో ఫిజికల్, మెడికల్, రాత పరీక్షలు నిర్వహించి ఆయా కేంద్రాలవారీ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ర్యాలీ కేంద్రానికి అడ్మిట్ కార్డు, ఫొటోలు, సంబంధిత సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలి.
వచ్చిన దరఖాస్తులను ఖాళీలకు అనుగుణంగా పదో తరగతిలో సాధించిన మార్కుల ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో నిలిచినవారికి సంబంధిత కేంద్రంలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. అందులోనూ అర్హత సాధిస్తే వైద్య పరీక్షలు చేస్తారు. ఈ దశలో అర్హులైనవారికే రాత పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలో ప్రాథమిక స్థాయి గణితం, సైన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. వీటిని పదో తరగతి స్థాయిలోనే ఇస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. పరీక్ష తేదీ వివరాలు తర్వాత ప్రకటిస్తారు. అర్హత సాధించినవారి వివరాలు ఆర్మీ వెబ్ సైట్‌లో ఉంచుతారు. సైన్యంలో పనిచేసినవారి పిల్లలకు, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారికి అదనంగా కొన్ని బోనస్ మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు వీటిని కలుపుతారు.
ఫిట్‌నెస్ టెస్టు: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. పది అడుగుల దూరానికి లాంగ్ జంప్, మూడు అడుగుల ఎత్తుకు హైజంప్ చేయగలగాలి.
శిక్షణ, వేతనం
ఎంపికైనవారికి సంబంధిత కేంద్రంలో 33 వారాలపాటు శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని సిపాయ్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి పురుష మిలటరీ పోలీస్‌లతో సమానంగా వేతనం, ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు దక్కుతాయి. శిక్షణ అనంతరం రూ.21,700 మూలవేతనం అందుతుంది. దీనికి అదనంగా గ్రేడ్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ...మొదలైనవి ఉంటాయి. అంటే విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. 15 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగినవారు పెన్షన్‌కు అర్హత సాధిస్తారు.
ఎవరు అర్హులు?
పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ (విమెన్ మిలిటరీ పోలీస్)
ఖాళీలు: 100
వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబరు 1, 2000 తర్వాత; ఏప్రిల్ 1, 2004 కంటే ముందు జన్మించాలి.
ఎత్తు: కనీసం 152 సెం.మీ. ఉండాలి. అందుకు తగ్గ బరువు తప్పనిసరి.
ఆన్‌లైన్ దరఖాస్తులు: జులై 20 వరకు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
Comments